హైదరాబాద్: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావుకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీస్ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని హైకోర్టు శ్రీనివాస్ రావును ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరీక్షలల నిర్వహణ తీరు సరిగా లేదని కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

రోజుకు 50వేల పరీక్షలు చేయాలనే తమ ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేయం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ విషయంపైనే శ్రీనివాస్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో మరోమారు విచారణ జరిగింది. 

అవసరం ఉన్నప్పుడు రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహిస్తామని నివేదికలో చెప్పడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలేమో గానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కరోనా రెండో దశ ఫలితాలు మాత్రం వస్తాయని వ్యాఖ్యానించింది. 

అదే జరిగితే కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. యశోద, కిమ్స్, కేర్, సన్ షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. 

రోజుకు 50 వేల కరోనా పరీక్షలు, వారానికో ఓ రోజు లక్ష రక్త పరీక్షలు చేయాలని హైకోర్టు ఇచీవల ఆదేశించింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆ్ర మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. 

జీహెచ్ఎంసీలో మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా జాగ్రత్తలకు సంబంధించిన 64 నెంబర్ జీవో అమలు బాధ్యత జీహెచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ జీవో అమలును పోలీసులకు అప్పగించాలని గతంలో కోర్టు ఆదేశించింది. 

కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సూచించింది. కరోనా బాధితులకు ధైర్యం కలిగించడానికి మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పింది. డిెసంబర్ 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.