పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని దాఖలైన పిటిషన్ పై గురువారంనాడు తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఓటర్ల నమోదు కోసం ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి నవంబర్ 7వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉన్న విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు.అయితే ఇటీవల కాలంలో వరదలు, వర్షాల కారణంగా ఓటర్ల నమోదుకు ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలో విపత్తులు వచ్చినా ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా అని హైకోర్టు ఈసీని ప్రశ్నించింది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

డిసెంబర్ 1 నుండి 31వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకోవచ్చో లేదా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది.ఈ విషయమై రేపటిలోపుగా తమకు స్పష్టంగా తెలపాలని హైకోర్టు  కోరింది.