హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ పై విచారణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.

సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషన్ వాదించారు. ఈ విషయమై  ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషనర్ కోరారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదాకు స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పిటిషన్ ను విచారించేందుకు అంగీకరించింది.

 

రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ దాసోజు శ్రవణ్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుండి ఎందుకు స్పందించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే సమయంలో ఎందుకు గుర్తుకు వచ్చిందని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది.

రాజకీయ దురుద్దేశ్యంతోనే పిల్ దాఖలైందని హైకోర్టు అభిప్రాయపడింది. 2015,2016 దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్ ను హైకోర్టు ఆదేశించింది.