టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు. అయితే దీనిపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ రవిప్రకాశ్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు రవిప్రకాశ్ గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉండటంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

టీవీ9ను ఇటీవల టేకోవర్ చేసిన అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో వాటాల వివాదంలో సంస్ధ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్‌.. మరికొందరు కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద కంపెనీ డైరెక్టర్ పి. కౌశిక్ రావ్ పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీ, టీవీ9 సీఈవో మాజీ సీఎఫ్‌వో మూర్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం విచారణకు హాజరుకావాలంటూ రెండోసారి నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌ హాజరుకాలేదు.

దీంతో ఈసారి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు. ఇచ్చిన గడువు ముగియడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.