తెలంగాణాలో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు: హైకోర్టు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు పెంపునకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 79 కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి ఫీజు పెంపునకు అనుమతిని తెచ్చుకున్నాయి.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు పెంపునకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఫీజుల పెంపు విషయమై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. 79 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల పెంపు విషయమై హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులను పొందాయి. టీఎస్ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఇంజినీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
హైకోర్టు అనుమతితో రాష్ట్రంలోని 36 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు లక్ష రూపాయాలు దాటింది.సీబీఐటీలో రూ.1.73లక్షలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలో రూ.1.55లక్షలు,శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీల్లో రూ.1.50లక్షలు, ఎంవీఎస్ఆర్ లో రూ.1.45 లక్షలు వార్షిక ఫీజుగా వసూలు చేయనున్నారు.
ఎంసెట్ లో పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. బీసీ, ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపు ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. ఈనెల 13 వరకు ఫీజు చెల్లింపునకు గడువు విధించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.