హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో వరద నీరు చేరకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నగరంలో గతంలో కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరిన విషయం తెలిసిందే.ఉస్మానియా ఆసుపత్రిలోకి వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని దాఖలైన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.

also read:ఉస్మానియా పాత భవనం సీజ్, డిపార్ట్‌మెంట్లు కొత్త భవనంలోకి: డీఎంఈ రమేష్ రెడ్డి

వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆసుపత్రిలో వరద నీరు నిలిచిపోయిందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు.వర్షం నీరు  ఉస్మానియా ఆసుపత్రిలోకి రాకుండా మూసీలో కలిసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని  హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.  
గతంలో మాదిరిగా వరద నీరు ఆసుపత్రిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. 

ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.