హైదరాబాద్: మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని  తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేయాలని ఎక్కడ ఉందని హైకోర్టు ప్రశ్నించింది. 

సచివాలయంలో మసీదు కూల్చివేతపై సయ్యద్ యూనస్, మహమ్మద్ ముజాఫరుల్లా, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేసింది.

సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి చెప్పారు. మసీదును కూల్చివేయడం చట్ట విరుద్దమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 657 గజాలున్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగుల స్థలం కేటాయించంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడ కూలిపోయిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త సచివాలయంలో కొత్త మసీదును నిర్మిస్తామని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఎక్కడ మసీదు ఉందో అక్కడే మసీదును నిర్మించాలని పిటిషనర్లు కోరారు. గుడిలోనే దేవుడికి ప్రార్ధనలు చేసుకోవాలని లేదని హైకోర్టు చెప్పింది. దేవుడు మనసులో ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని హైకోర్టు తెలిపింది.

ప్రజల అవసరాల కోసం మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు చెప్పింది. అవసరమైతే నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కొత్త సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చి నిర్మిస్తామని  సీఎం కేసీఆర్ ప్రకటించారు. కూల్చివేసిన స్థలంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. సచివాలయం నిర్మాణానికి రూ, 400 కోట్లను ఖర్చు చేయనుంది తెలంగాణ సర్కార్.