హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీ, ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్  లోకేష్ కుమార్ లకు హైకోర్టు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 1వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ చేసింది.ఈ విచారణ తర్వాత ఈ నెల 7వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలకు కొనసాగింపుగానే ఆదివారం నాడు తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలను ఇచ్చింది.ఈ నెల 1వ తేదీన హైకోర్టుకు ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నివేదికపై హైకోర్టు మండిపడింది. ఈ నెల 6వ తేదీలోపుగా వాస్తవ లెక్కలతో నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మను హైకోర్టు ఆదేశించింది. 2018-19లో ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుండి రావాల్సిన బకాయిలు తెలపాలని హైకోర్టు సూచించింది.

ఈ ఏడాది బకాయిలు చెల్లించాలని జీహెచ్ఎంసీని ఆర్టీసీ కోరిందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ బకాయిలు చెల్లించకపోతే ఎందుకు జీహెచ్ఎంసీని అడగలేదో సరైన కారణాలను నివేదికలో పేర్కొనాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

2013-14 ఆర్ధిక సంవత్సరం నుండి ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన  బకాయిల వివరాలను తెలపాలని కోర్టు ఆదేశించింది.ఈ నెల 1వ తేదీన ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో నిర్వహించిన విచారణ సమయంలో ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నివేదికలో అన్ని తప్పులే ఉన్నాయని పేర్కొంది. తప్పుడు నివేదికలను సరిచేసి ఈ నెల 6వ తేదీ లోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.