తెలంగాణలో అన్ని కోర్టులు తెరవాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 31 వరకు కోర్టులు పాటించాల్సిన అన్‌లాక్ విధానాలను ఆదివారం వెల్లడించింది.

ఇప్పటికే జిల్లాల్లో కేసుల విచారణ భౌతికంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ జిల్లాలోని సివిల్, జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. ఇక హైకోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్‌లైన్‌ విధానంతో పాటు భౌతిక విచారణ కొనసాగనుంది.

అలాగే ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ వేగంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణలోని అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లకు హైకోర్టు లాక్‌డౌన్‌ విధించింది. అయితే, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.