Asianet News TeluguAsianet News Telugu

రాజాసింగ్ పై పీడీ యాక్ట్: కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదుచేసిన పీడీ యాక్ట్ పై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఈ నెల 20వ తేదీలోపుగా కౌంటర్  దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 
 

Telangana High Court Orders Government To File Counter  on Raja singh Case
Author
First Published Oct 11, 2022, 5:37 PM IST

హైదరాబాద్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై ఈ నెల 20వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి గడువును పెంచబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. 

గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్  పై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు  విచారణ నిర్వహించింది.  పీడీ  యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఇటీవలనే ముగిసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ బోర్డు నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. ఈ నిర్ణయం వచ్చే వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది.  కనీనం రెండు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.ఈ నెల 20వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

ఈ ఏడాది ఆగస్టు 25 వ తేదీన పీడీ యాక్ట్  కింద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ కింద అరెస్టైన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు భేటీ జరిగింది.ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాజాసింగ్ హాజరయ్యారు. తనపై పీడీ యాక్ట్ ను నమోదు చేయడంపై  రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇదే రకమైన అభ్యంతరాలతో రాజాసింగ్ భార్య ఉషాబాయ్  పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డుకు వినతిపత్రం సమర్పించింది. పీడీ యాక్ట్  విధించడాన్ని హైకోర్టులో  రాజాసింగ్  సవాల్ చేశారు.

also read:పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు భేటీ: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాజాసింగ్

మహ్మద్ ప్రవక్తను కించపర్చారనే ఆరోపణలతో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.ఈ నోటీసులకు రాజాసింగ్ నిన్ననే సమాధానం పంపారు.ఈ ఏడాదిఆగస్టు 23న రాజాసింగ్ ను బీజేపీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షో నిర్వహించవద్దని  రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ షో నిర్వహించడంపైరాజాసింగ్ మండిపడ్డారు.ఈ షో ను నిర్వహించడంపై మండిపడుతూ  సోషల్ మీడియాలో చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఈ వీడియోలో వ్యాఖ్యలున్నాయని  రాజాసింగ్ పై బీజేపీ చర్యలు తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios