అమ్నేషియా పబ్ కేసులో కీలక మలుపు: ఆ నిందితుడిని మైనర్ గా పరిగణించాలని హైకోర్టు ఆదేశం
అమ్నేషియా పబ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ యువకుడిని మైనర్ గానే పరిగణించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: అమ్నేషియా పబ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ ను మేజర్ గా పరిగణించాలని పోలీసులు చేసిన వినతిని జువైనల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిందితుడిని మేజర్ గా పరిణగిస్తున్నట్టుగా జువైనల్ కోర్టు తెలిపింది. జువైనల్ కోర్టు తీర్పును మైనర్ బాలుడి తండ్రి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించింది.
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జువైనల్ కోర్టు మేజర్ గా పరిగణించిన నిందితుడిని మైనర్ గా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. మైనర్ బాలుడు ఓ ప్రజా ప్రతినిధి కొడుకు. అమ్మేషియా పబ్ కేసులో మైనర్ బాలికపై కారులోనే నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అమ్నేషియా పబ్ కేసులో మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ 2022 సెప్టెంబర్ 30న జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోర్టును పోలీసులు అభ్యర్ధించారు. ఈ మేరకు 2022 సెప్టెంబర్ 2న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2022 మే 28న స్నేహితులతో కలిసి ప్రెషర్స్ పార్టీకి వెళ్లిన మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మైనర్ బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది. బాలిక స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు ఉపయోగించిన కారుతో పాటు నిందితులు ఉపయోగించిన ఫోన్లను కూడా పోలీసులు సేకరించారు.