తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.  గతంలో పంచాయితీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలపై కూడా కొందరు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం జరిగిందని...జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను ఆపలేమని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. 

ఇప్పటికే అసెంబ్లీ, పంచాయితీ, లోక్ సభ ఎన్నికలు పూర్తవగా పనిలోపనిగా స్థానిక సంస్థలను ఎన్నికలను కూడా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ కూడా ఎంపిటీసి, జడ్పిటిసి ఎన్నికలను నిర్వహించడానికి సిద్దమయ్యింది. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు  ప్రక్రియను చేపట్టిన ఈసీ జిల్లాలు, మండలాల వారిగా రిజర్వేషన్లను ప్రకటించింది. 

అయితే రాష్ట్రంలో అధిక సంఖ్యలో వున్న బీసీలకు ఈ రిజర్వేషన్ల కేటాయంపులో ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై ఇవాళ  విచారణ  జరగ్గా ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలకే పంచాయితీ ఎన్నికల్లో నష్టం జరిగిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది రామచందర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. కాబట్టి మళ్లీ అదే రిజర్వేషన్ల ప్రకారం ఈ  ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికలు జరిగితే మరోసారి వారు నష్టపోతారని ఆయన న్యాయమూర్తికి విన్నవించారు. 

అయితే పంచాయతీ రాజ్ చట్టం, సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం లోబడే ఉండాలని చెబుతున్నాయి న్యాయమూర్తి గుర్తుచేశారు. కాబట్టి ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆపలేమని ఆయన తేల్చిచెప్పింది.  హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.