తెలంగాణ హైకోర్ట్ జడ్జ్ కేశవరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే ఆయన మృతికి సంతాపంగా హైకోర్ట్ సహా రాష్ట్రంలోని కోర్టులన్నింటికి సెలవు ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. సింకింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారుజుమున 3.47గంటలకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాపంగా హైకోర్టుతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైకోర్టు రీజిస్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

జస్టిస్ పి. కేశవరావు మరణవార్త తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్.
జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు మృతి పట్ల న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చాలా సాధారణ జీవితం గడిపిన కేశవ రావు మంచి విలువలున్న మానవతావాది అని కొనియాడారు. కేశవరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు.
సోమవారం ఉదయం 9గంటల నుండి మద్యాహ్నం 2గంటల వరకు హబ్సిగూడలోని స్వగృహంలో కేశవరావు పార్థివదేహాన్ని వుంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
