రాష్ట్ర ప్రభుత్వం వెలమ , కమ్మ సంఘాలకు భూ కేటాయింపులు చేయడాన్ని తెలంగాణ హైకోర్ట్ తప్పుబట్టింది. ఇది సమాజాన్ని కులాల వారీగా విభజించే విధానమంటూ మండిపడింది. 21వ శతాబ్ధంలో, అందులోనూ హైటెక్ రాష్ట్రంలో ఇదేం పద్ధతని ప్రశ్నించింది.
వెలమ , కమ్మ సంఘాలకు భూ కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో ఖానాపూర్‌మెట్‌లో కమ్మ, వెలమ సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం 5 ఎకరాల చొప్పున కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వంపై కోర్ట్ స్పందిస్తూ.. కులాలవారీగా భూములు కేటాయించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కులాలవారీగా భూములు కేటాయించడమన్నది ఆర్టికల్ 14కి విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఇది సమాజంలో కుల విభజనకు దారి తీసేలా వుందని.. 21వ శతాబ్ధంలో, అందులోనూ హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానమని హైకోర్ట్ ప్రశ్నించింది. ప్రభుత్వం విశాలంగా ఆలోచించి.. ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాలకు భూములు కేటాయించడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి పాలసీలు వుండాలని ధర్మాసనం సూచించింది.
మరోవైపు.. శారదా పీఠం, జీయర్ వేదిక్ అకాడమీకి భూముల కేటాయింపుపైనా హైకోర్టులో విచారణ జరిగింది. కోట్ల విలువైన భూములను ఎకరానికి రూపాయి చొప్పున ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమంటూ సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా హైకోర్ట్ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ ఏజీ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సంప్రదాయాలను, వేదాలను ప్రోత్సహించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. శారదా పీఠం, జీయర్ అకాడమీకి భూ కేటాయింపులపై కేబినెట్ నిర్ణయాల్లో తప్పేమీ లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. శారదా పీఠం భూముల కేటాయింపుపై జూలై 24కి, జీయర్ అకాడమీకి భూ కేటాయింపులపై ఆగస్ట్ 1న విచారణ చేపడతామని పేర్కొంది. ఈ మేరకు ఇరువురికి నోటీసులు జారీ చేసింది.
అలాగే రెడ్డి కాలేజీ సొసైటీకి బద్వేల్‌లో భూ కేటాయింపులపైనా హైకోర్ట్ విచారణ చేపట్టింది. కోట్లు విలువైన భూములను ఎకరం రూపాయి చొప్పున 5 ఎకరాలు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు రాజేశ్వరరావు, విజయ్ కుమార్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్ట్ స్పందిస్తూ.. ఐదేళ్ల క్రితం భూ కేటాయింపులు జరిగితే, ఇప్పుడు పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ స్పందిస్తూ.. భూ కేటాయింపులకు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదని పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జూన్ 23కి వాయిదా వేసింది. అలాగే పిటిషన్ దాఖలు చేయడంలో జరిగిన జాప్యానికి కారణాలు, ప్రస్తుత భూమి దశ ఏ విధంగా వుందో తెలియజేయాలంటూ పిటిషనర్‌ను ఆదేశించింది.
ఇక మరో కేసులో ప్రముఖ చలన చిత్ర దర్శకుడు ఎన్ . శంకర్‌కు మోకిల ప్రాంతంలో 5 ఎకరాల కేటాయింపుపై హైకోర్టు విచారించింది. రూ.కోట్లు విలువైన భూమిని ఎకరా రూ.5 లక్షలకే కేటాయించారంటూ కరీంనగర్‌కు చెందిన జే శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సిఫారసు మేరకు రాయితీ ధరతో భూమిని కేటాయించే అధికారం రాష్ట్ర కేబినెట్‌కు వుందని వాదించారు.
సినిమా స్టూడియో నిర్మాణం కోసమే భూ కేటాయింపు జరిగిందని ఏజీ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి ఏపీలోనూ ఇలాంటి కేటాయింపులు జరిగాయని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్థానికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే దర్శకుడు శంకర్‌కు భూమిని కేటాయించినట్లు వాదించారు. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. 2007 తర్వాత భూ కేటాయింపులకు సంబంధించిన చట్టాలు మారాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను జూలై 5కి వాయిదా వేసింది.
