ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం వుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. శ్రీధర్‌బాబు, రవి, తాహీర్ అనే ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది ధర్మాసనం.

మున్సిపాలిటీల్లో పోటీకి అనర్హులని, ఇటీవల ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయాన్ని న్యాయస్ధానం దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీలో మాత్రం అనర్హులుగా చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. దీనిపై ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు పలు రాజకీయపార్టీలతో ఎస్ఈసీ సమావేశమైంది. 

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించింది.  దీపావళి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ విషయమై ఎస్ఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం  ఓటరు లిస్టును విడుదల చేయనుంది.

రాజకీయ పార్టీలన్నీ ఓటరు జాబితాలో తప్పులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. గతంలో చోటు చేసుకొన్న అవకతవకలను రాజకీయపార్టీలు ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చాయి. 

ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సమయాన్ని కేటాయించింది. ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించింది.

ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకొన్నాయని బీజేపీ ఆరోపించింది.  స్థానిక నాయకులతో కలిసి అధికారులు ఓట్లను తొలగించారని బీజేపీ  నేత రామచంద్రారెడ్డి ఆరోపించారు.  ఓట్లను తొలగించిన డివిజన్ల వివరాలను ఆయన వివరించారు.