వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. జర్మనీలో రిటైర్డ్ ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ.. భారత్‌లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని లాయర్ రవికిరణ్ వాదించారు.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆది శ్రీనివాస్ తరపున సీనియర్ లాయర్ రవికిరణ్ రావు వాదనలు వినిపించారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ, కోర్టులను, ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని రవికిరణ్ రావు వాదించారు. చెన్నమనేని ఇంకా జర్మనీ పౌరసత్వం కలిగి వున్నారని.. జర్మనీ పౌరసత్వంపైనే చెన్నమనేని ప్రమాణాలు చేస్తున్నారని లాయర్ వాదించారు.
దీనిపై హైకోర్టు.. చెన్నమనేనికి వీసాలున్నాయా..? ఎలా ప్రయాణిస్తున్నాడని ప్రశ్నించింది. దీనికి లాయర్ రవికిరణ్ బదులిస్తూ.. 2023 వరకు ఆయన జర్మనీ పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్నారని తెలిపారు. జర్మనీలో రిటైర్డ్ ప్రొఫెసర్‌గా చెప్పుకుంటూ.. భారత్‌లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, రాజ్యాంగం నిబంధనలను చెన్నమనేని ఉల్లంఘించారని రవికిరణ్ కోర్టుకు వివరించారు. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ALso Read:మరోసారి తెరమీదకి వచ్చిన చెన్నమనేని పౌరసర్వ వివాదం.. నేడే విచారణ
కాగా.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గతకొంతకాలంగా విచారణ జరుగుతోంది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు, చెన్నమనేని తరపున అడ్వకేట్ రామారావు, ఆది శ్రీనివాస్ తరుపున రవికిరణ్ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
