ఓ హత్య కేసులో పోలీసుల వాదనను విన్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది
ఓ హత్య కేసులో పోలీసుల వాదనను విన్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాకు చెందిన తూర్పాటి కామాక్షి అనే మహిళను వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్‌లు కలిసి చీపురు కట్టతో చంపారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన కింది కోర్టు.. వీరిద్దరికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పును సవాలు చేసిన నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారని తెలిపారు. డాక్టర్ నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడం వల్ల సదరు మహిళ చనిపోయినట్లు తేలిందని, ఇది హత్య కాదని పేర్కొన్నారు.
అయితే ఆ మహిళది హత్యేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. చీపురుతో కొడితే మనిషి చనిపోతారా అంటూ విస్మయం వ్యక్తం చేసింది.
కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నంచింది. తాము ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని .. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇరువురు చెరో రూ.30 వేల పూచీకత్తును సమర్పించాలని, అలాగే జైలు నుంచి విడుదలైన వెంటనే నివాస ధ్రువీకరణ పత్రాలు పోలీసులకు ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరు కావడంతో పాటు కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
