Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై ఉత్సాహం, ఆసక్తి తగ్గిపోయాయి: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు తగినంత సన్నద్ధత కనిపించడం లేదంటూ హైకోర్టు మండిపడింది

telangana high court fires on state govt over coronavirus
Author
Hyderabad, First Published Jun 17, 2020, 7:45 PM IST

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు తగినంత సన్నద్ధత కనిపించడం లేదంటూ హైకోర్టు మండిపడింది.

రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్ధితి మరింత దారుణంగా తయారైందని... వైద్య సిబ్బందికి తగినన్న పీపీఈ కిట్లు ఇవ్వటం లేదన్న పిల్‌పై ఉన్నత న్యాయస్ధానం బుధవారం విచారణ జరిపింది.

దీనిలో భాగంగా పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయో, సిబ్బందికి ఎన్ని ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపటిలోగా వివరాలు అందజేయాలని గాంధీ, నిమ్స్, కింగ్  కోఠి, ఫీవర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లను న్యాయస్ధానం ఆదేశించింది.

రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా వ్యాపించిందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ 19 నివారణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయాయన్న హైకోర్టు.. ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణిలో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని మూడు వారాలుగా చెబుతున్నా తమ ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని న్యాయస్ధానం అసహనం వ్యక్తం చేసింది. మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే అలాగే ఉంటామని చెప్పింది.

కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ప్రజలందరికీ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్షలు తక్కువగా చేస్తే కరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని నిలదీసింది.

కరోనా చికిత్సలు గాంధీకే ఎందుకు పరిమితం చేశారన్న కోర్టు.. నిమ్స్ వంటి ఆసుపత్రులను కోవిడ్‌కు ఎందుకు వినియోగించడం లేదని న్యాయస్ధానం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు కూడా గజిబిజీగా ఉంటున్నాయని.. గాంధీలో జూడాలు సమ్మె చేయడం అక్కడి పరిస్ధితికి అద్దం పడుతోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ సూపరింటెండెంట్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios