ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు.. పట్టించిన రైతు బంధు డబ్బులు..!!
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. వనమా ఎన్నికల అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని దాఖలైన పిటిషన్ విచారణలో.. ఆ ఆరోపణలు సరైనవే అనేలా సాగు భూమికి వనమా, ఆయన భార్య రైతు బంధు డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి.
హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు.. తనతో పటు, తన పద్మావతికి చెందిన కొన్ని ఆస్తులను వెల్లడించకుండా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయనపై మైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆ ఎన్నికల్లో వనమాపై బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 4,139 ఓట్ల తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినందుకు వనమా వెంకటేశ్వరరావుకు రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన న్యాయపరమైన ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి మంగళవారం 84 పేజీల సుదీర్ఘ తీర్పు చెప్పారు.
2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇక, 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వనమా.. ఎన్నికల్లో విజయం తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పు డు వివరాలు సమర్పించారని.. ఆయన ఎన్నిక రద్దు చేయాలని జలగం వెంకట్రావు 2019 జనవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వనమా ఆయన భార్యకు సంబంధించిన ఆస్తుల వివరాలు వెల్లడించలేదని.. ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదని కూడా ఆరోపణలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యేగా వనమా ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు.
అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయితే వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ప్రకటించడానికి.. జలగం వెంకట్రావు చేసిన ఆరోపణలు సరైనవే అనేలా సాగు భూమికి వనమా రైతు బంధు డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు లభించడం ప్రధాన కారణంగా నిలిచిందనే చెప్పాలి. అలాగే ఈ కేసులో పాల్వంచ మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్, చిక్కడపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సాక్ష్యాలను హైకోర్టు నమోదు చేసింది.
పాల్పంచలోని సర్వే నెంబర్ 122/2లో వనమాకు 1.33 ఎకరాలు ఉందని.. దానిని ఎన్నికల అఫిడవిట్‌లో చూపడంలో ఆయన విఫలమయ్యారని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల డిపాజిషన్లపై న్యాయమూర్తి ఆధారపడ్డారు. ఆ భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎనిమిదిసార్లు మొత్తం రూ.69,350 తీసుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది.
అదేవిధంగా పాల్పంచలోని సర్వే నెంబర్ 992/2లో 8.37 ఎకరాల వ్యవసాయ భూమి తన భార్య పద్మావతి కలిగి ఉందన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే వెల్లడించలేదు. ఈ భూమిపై తన భార్య యాజమాన్యాన్ని కూడా తిరస్కరించలేదు. వనమా, అతని భార్య ఇద్దరూ ఈ భూములకు సంబంధించి రైతు బంధు సహాయాన్ని పొందుతున్నారని.. ఇది వారి వారి యాజమాన్యాన్ని రుజువు చేస్తున్నాయని జస్టిస్ రాధారాణి స్పష్టం చేశారు.
పిటిషనర్ సమర్పించిన సాక్ష్యాలను తిరస్కరించడానికి లేదా సాక్ష్యం ఇవ్వడానికి ఎమ్మెల్యే కోర్టుకు హాజరాకపోవడంతో.. చట్టంలోని సెక్షన్ 114 (జీ) కింద అతనిపై ప్రతికూల అనుమతులు తీసుకోవచ్చని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిటిషనర్ అవసరమైన అన్ని పత్రాలను నిర్ణీత సమయంలోగా దాఖలు చేయలేదని వాదిస్తూ వనమా తరపు న్యాయవాది లేవనెత్తిన అనేక సాంకేతిక అభ్యంతరాలను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘‘ఎన్నికలు జరిగిన 45 రోజులలోపు పత్రాలను దాఖలు చేయాలనే నిబంధనను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. పిటిషనర్ సమాచార హక్కు మార్గం ద్వారా వాటిని పొందలేరు. ఈ లోపాన్ని విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విస్మరించవచ్చు’’ అని జస్టిస్ రాధారాణి పేర్కొన్నారు.
‘‘కొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలను వనమా వెంకటేశ్వరావు వాటిని 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు.. కానీ 2018లో చూపించలేదు. అతని భార్య పేరు మీద ఉన్న ఆస్తులను దాచిపెట్టడం చట్టం ప్రకారం బహిర్గతం చేయకపోవడమే అవుతుంది’’ అని వనమాపై అనర్హత వేటు వేస్తూ జస్టిస్ రాధారాణి పేర్కొన్నారు.