Singareni| ఆ లోగా ఎన్నికలు నిర్వహించండి.. సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Singareni: సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది.

Singareni: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలంటూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, సంస్థ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
వాస్తవానికి సింగరేణి ఎన్నికలకు మే 22న కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, అసెంబ్లీ ఎన్నికలు, వరుస పండగలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు జరిపే పరిస్థితి లేదంటూ సింగరేణి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎన్నికల ప్రక్రియను కొనసాగించి అక్టోబరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
గతవారమే ఈ పిటిషన్ పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో సింగరేణి తరఫున ఏఏజీ జె.రామచంద్రరావు, స్టాండింగ్ కౌన్సిల్ శ్రీహర్షారెడ్డి లు తమ వాదనలు వినిపించారు. కార్మిక సంఘాల తరఫున సీనియర్ లాయర్ జి.విద్యాసాగర్ తన వాదిస్తూ.. ఎన్నికల కోసం సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు అక్టోబరు వరకు గడువు ఇచ్చిందని ప్రస్తావించారు. ఈ ఇరు వాదనలు విన్న ధర్మసనం ఈ తీర్పును రిజర్వ్ లో పెట్టి.. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది.