వ‌రంగ‌ల్: సామాజిక స‌మ‌స్య‌గా మారిన క‌రోనే వైర‌స్ విస్తృతిని అడ్డుకోవ‌డానికి అన్ని ర‌కాలుగా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డ‌బ్బుల‌కు కొదవ లేదని...కానీ కావాల్సింద‌ల్లా ట్రీట్ మెంటు తో పాటు వైర‌స్ ని ఎదుర్కొనే సంక‌ల్పం, ధైర్యం మాత్రమేనని అన్నారు. ఆ ధైర్యాన్ని ప్ర‌జ‌లకు ఇవ్వాలన్నారు. 24 గంట‌ల‌పాటూ వైద్యులు అందుబాటులో ఉండాలని... ఏ జిల్లా క‌రోనా బాధితుల‌కు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్ జ‌ర‌గాలన్నారు. అందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామని  మంత్రి ఈట‌లతో పాటు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 

ఇద్ద‌రు మంత్రులు కలిసి వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జా ప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్లు, వైద్యాధికారుల‌తో క‌లిసి క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌పై హంట‌ర్ రోడ్డులోని ఓ ఫంక్ష‌న్ హాలులో మంగ‌ళ‌వారం సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాల వారీగా క‌రోనా వైర‌స్ విస్తృతి ప‌రిస్థితుల‌ను కూలంక‌షంగా చ‌ర్చించారు. 

read more  ఇతర రాష్ట్రాల కంటే తక్కువ పరీక్షలెందుకు?: సీఎస్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ...కరోనా మరణాల్లో ఎలాంటి గోప్యత లేదన్నారు. అయినా గోప్యత ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణలో సాధారణంగా రోజుకు వెయ్యిమంది చనిపోతారని... కానీ ఆ మరణాల్నీ కరోనా చావులు కాదన్నారు. ఎలా చనిపోయినా కరోనాతో చనిపోయినట్టు భయపడుతున్నారని పేర్కొన్నారు. 

ఎంజీఎంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని... ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులన్నీ ఎంజీఎంలో చికిత్స అందిస్తామన్నారు. కుటుంబ సభ్యులే కాదనుకుంటున్న వారికి వైద్యులు ట్రీట్మెంట్ చేయడం గొప్ప విషయమన్నారు. మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వెంటనే వివరణ ఇవ్వాలని ఈటల పేర్కొన్నారు. 

ఏ లోటు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని...కొవిడ్ పేషెంట్లకు ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు. వరంగల్ నుంచి ఒక్క కొవిడ్ కేసును కూడా హైదరాబాద్ కు పంపొద్దన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి సూపరింటెండెంట్ ను త్వరలోనే నియమిస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.