హైదరాబాద్:గుజరాత్ రాష్ట్రంలో కరోనా తీవ్రతపై ప్రధాని మోడీ బాధ్యత వహిస్తారా అని  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బాధ్యత లేకుండా మాట్లాడారన్నారు. ఇది పరస్పరం ఆరోపణలు చేసుకొనే సమయం కాదని ఆయన సూచించారు. 

also read:కరోనాకు మందు కనిపెట్టిన హైద్రాబాద్ హెటిరో: కోవిఫోర్‌ పేరుతో మార్కెట్లోకి విడుదల

బీజేపీ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో సరిచూసుకోవాలని ఆయన హితవు పలికారు.కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.కరోనా అనేది ప్రపంచ సమస్యగా ఆయన చెప్పారు. 

దేశానికి కంటైన్మెంట్ ను పరిచయం చేసిందే తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో మర్కజ్ వ్యవహరాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపింది కూడ తామేనని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

లాక్ డౌన్ ను  పకడ్బందీగా అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను పలు సంస్థలు ప్రశంసించాయన్నారు.పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు అడిగితే కేంద్రం తమ రాష్ట్రానికి ఎన్ని పంపిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.వెయ్యి వెంటిలేటర్లు అడిగితే 50 వెంటిలేటర్లు ఇచ్చారన్నారు.ఆధారాలు లేకుండా అర్ధరహితమైన విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు. 

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కరోనా నివారణకు మీరు చేశారో చెప్పాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ చర్యలు చేపట్టిందని ఆయన విమర్శలు గుప్పించారు.