కరోనా వైరస్‌ పూర్తిగా పోలేదని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బుధవారం ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... కరోనాతో 99.5 శాతంపైగా బతికి బయటపడ్డారని, కేవలం 0.5 శాతం మంది మాత్రమే చనిపోయారని రాజేందర్ చెప్పారు.

ఈ మహమ్మారి వల్ల ఎంతో మంతి ఆత్యీయులను పొగొట్టుకున్నామని, ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటూ కరోనాను తరిమేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే పండుగలను ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని.. గుంపు గుంపులుగా గుమికూడి కోవిడ్‌ వ్యాధిని మరింత వ్యాప్తి చెందేలా దోహదపడకూడదని ఈటల సూచించారు. 

హుజూరాబాద్‌ ప్రజలు హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా డయాలసిస్‌ సెంటర్‌ను ఇక్కడే ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే హుజూరాబాద్‌లో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్‌ ఆస్పత్రిగా అన్ని పరికరాలతో అభివృద్ధి చేస్తానని, అదే తన జీవిత ఆశయమని ఈటల స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతుల అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ శ్రేణులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.