ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రోగుల వాహనాలను అడ్డుకుంటున్నామంటూ వస్తున్న వార్తలపై స్పందించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఆయన స్పష్టం చేశారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రోగుల వాహనాలను అడ్డుకుంటున్నామంటూ వస్తున్న వార్తలపై స్పందించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఆయన స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని శ్రీనివాసరావు అన్నారు. 

పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే తెలంగాణాలోని ఆస్పత్రిని ముందుగా సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో ఉండేవని.. బెడ్లు లేకుండా వచ్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఈ విషయమై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల ప్రభుత్వాలకు సీఎస్‌ లేఖ రాశారని డీహెచ్ వెల్లడించారు. ఆస్పత్రి వారే రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపుతారని.. ఆ వివరాలను పరిశీలించి అనుమతి ఇస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Also Read:తెలంగాణలోకి నో ఎంట్రీ: పుల్లూరు చెక్‌పోస్టు వద్ద బీజేపీ ఆందోళన, ఉద్రిక్తత

ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయమని తాము ఎప్పుడూ చెప్పలేదని.. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని డీహెచ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఐదుగురు రోగులకు అనుమతి ఇచ్చామని శ్రీనివాసరావు వెల్లడించారు.

స్టేట్ కంట్రోల్ రూమ్‌ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం ఏర్పాటు చేశామని.. పొరుగు రాష్ట్రాల వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలోని మెడిసిన్, బెడ్స్‌ని ఇతర రాష్ట్రాల వారితో పంచుకుంటున్నామని.. బిహార్, ఢిల్లీ నుంచి సైతం రోగులు హైదరాబాద్ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ ఏ రోజుకి ఆ రోజే సరిపోతుందని.. దీంతో ఆక్సిజన్‌ ఆడిట్‌ విధానం పెట్టుకున్నామని శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం నుంచైనా రోగులు తెలంగాణ రావచ్చు అని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు.