Asianet News TeluguAsianet News Telugu

అదే కరోనా థర్డ్ వేవ్ కు దారితీయవచ్చు: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక

కరోనా థర్డ్ వేవ్ పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ రావచ్చు... రాకపోవచ్చు... కానీ ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. 

telangana health director srinivas rao comments on corona third wave akp
Author
Hyderabad, First Published Jul 12, 2021, 4:08 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చింది... పాజిటివ్ రేట్ చాలా వరకు తగ్గిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కొవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని శ్రీనివాసరావు అన్నారు. 

సిఎం కేసీఅర్ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రెండు రోజుల క్రితమే రివ్యూ చేశారని తెలిపారు. ఆయన ఆదేశాలతోనే కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో నిన్నటి(ఆదివారం) నుండి  పర్యటిస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు. 

''మూడో వేవ్ వస్తుందో లేదో తెలియదు. వస్తే ఎదుర్కోడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్రంవ్యాప్తంగా మొత్తం 25వేల ఆక్సిజన్ బెడ్ లు సిద్దంగా ఉంచాం. రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఫీవర్ సర్వే చేశాం ఇప్పుడు నాలుగో ఫీవర్ సర్వే ప్రారంభిస్తున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మూడో వేవ్ వచ్చే ప్రమాదం వుంది. కాబట్టి ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి'' అని శ్రీనివాసరావు సూచించారు. 

read more  తెలంగాణలో అదుపులోకి కరోనా : 500లోపే కొత్త కేసులు.. నారాయణ పేట, కామరెడ్డిలలో ‘‘సున్నా’’

''రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సహకరించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చాం. హై రిస్క్ ఉన్న నలభై ఐదు లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా రెండు నుండి రెండున్నర లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మందికి మొదటి వ్యాక్సిన్ పూర్తి చేశాం'' అని శ్రీనివాసరావు తెలిపారు. 
  
''సీజనల్ వ్యాధులు చాలా తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 11 సున్నిత ప్రాంతాలను ఐడెంటిఫై చేశాం. రాష్ట్రంలో ప్రతి రోజూ లక్షకు తగ్గకుండా కరోనా పరీక్షలు చేస్తున్నాం. కోవిషిల్డ్ వ్యాక్సిన్ సమయం పెంచడం వల్ల ఎక్కవగా రక్షణ కల్పిస్తుంది'' అని శ్రీనివాసరావు వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios