హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టుకు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని వైద్య శాఖ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో చిన్న పిల్లల కోసం 4 వేల బెడ్స్ సిద్దం చేశామని ఉన్నత న్యాయస్థానానికి వైద్య శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 29 నుండి ప్రతి రోజూ లక్ష కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.తెలంగాణలో ఇప్పటివరకు 66,79,098 మందికి వ్యాక్సిన్లు వేశామని వైద్యశాఖ ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. 

also read:అన్ని భవిష్యత్తులోనే చేస్తారా?..: కరోనాపై తెలంగాణ ప్రభుత్వ నివేదికపై హైకోర్టు ఆగ్రహం

హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి కూడ నివేదికను సమర్పించారు.  కరోనా మందుల బ్లాక్ మార్కెట్ చేసే వారిపై  160 కేసులు నమోదు చేసినట్టుగా డీజీపీ చెప్పారు. బౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు ధరించని 4.56 లక్షల మందిపై కేసులు పెట్టామన్నారు. కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై 3.43 లక్షల మందిపై కేసులు నమోదు చేసినట్టుగా ఆ రిపోర్టులో డీజీపీ వివరించారు.  కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారి నుండి ఇప్పటి వరకు రూ. 37.94 కోట్ల జరిమానాను వసూలు చేశామని తెలిపారు.