హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా సుమారు రూ. 400 కోట్లకు పైగా మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. 

ఈ రెండు రోజుల్లోనే సుమారు 10 లక్షల కేసుల మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో రూ. 600 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం డిసెంబర్ చివరి రెండు రోజుల్లోనే రూ. 400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

ప్రతి రోజూ సగటున రూ. 62 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అయితే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే పేరుతో రోజు సగటుకు ఆరు రెట్లు ఎక్కువగా మద్యం విక్రయాలు సాగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. 

హైద్రాబాద్ జీహెచ్ఎంసీ పరిదిలోనే ఏకంగా కొత్త సంవత్సరం వేడుకలకు స్వాగతం పలికే పేరుతో రూ. 100 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. హైద్రాబాద్ లో ఈ రెండు రోజుల్లో 4.5 లక్షల బీర్లు, 5.10 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగాయి.


ఏపీలో మద్యం అమ్మకాలు 

కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ భారీగా మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. డిసెంబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా రూ.92 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 

సగటున రోజుకు రూ.60 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని సాధారణం కంటే మరో రూ. 30 కోట్లు అదనంగా మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. ఈ రెండు రోజుల్లో రూ. 170 కోట్ల విలువైన మధ్యం అమ్మకాలు సాగినట్టుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జనవరి 1వ తేదీన 1.65 లక్షల కేసుల లిక్కర్, 60 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.