బాసర ట్రిపుల్ ఐటీ ఏవోను విధుల నుంచి తప్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజులు గడుస్తున్నా విద్యార్ధులు ఆందోళనను విరమించకపోవడంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
రోజులు గడుస్తున్నా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఆందోళన విరమించకపోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు రకాలుగా నచ్చజెప్పినా పిల్లలు లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ ఏవోపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను విధుల నుంచి తప్పిస్తూ తెలంగాణ శుక్రవారం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు.. విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడలేదు. శనివారం విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (indrakaran reddy) , ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడంతో సోమవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు చెప్పారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. సమస్యల పరిష్కారినికి ఒప్పుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్వీట్లు చేయాలని విద్యార్థులు కోరారని ఆయన చెప్పారు. వారి కోరిక మేరకు మంత్రులతో ట్వీట్ చేయించేందుకు ఒప్పుకున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ, ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. జోరు వర్షంలో సైతం ఆందోళన కొనసాగిస్తూ... మంత్రి ప్రకటనను ఖండిస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు.
Also Read:బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళన : చర్చలు విఫలమయ్యాయంటున్న విద్యార్ధులు.. కాదంటోన్న ఇంద్రకరణ్ రెడ్డి
అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీ (basara iiit) విద్యార్థుల ఆందోళనలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) స్పందించారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు ఆమె శనివారం లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని... విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించామని.. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకట రమణను ప్రభుత్వం మీ వద్దకు పంపిందని సబిత తెలిపారు. ఇది మీ ప్రభుత్వమని దయచేసి చర్చించాలని విద్యాశాఖ మంత్రి లేఖలో తెలిపారు.
యూనివర్సిటీ సమస్యలు తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. ఏ వర్సిటీలో లేని విధంగా బాసరలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీ ఉందని, ఈ కమిటీ, యూనివర్సిటీ కమిటీ చర్చించుకుని పరిష్కరించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. కరోనా వల్ల రెండేళ్లు సమస్యలు పరిష్కరించడంలో జాప్యమయిందని ఆమె పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ ప్రతిష్టకు భంగం కలగవద్దని సబిత ఇంద్రారెడ్డి విద్యార్ధులకు సూచించారు.
