Mahbubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో బాలికల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
Minister for Tribal Welfare Satyavathi Rathod: పేద విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో బాలికల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అనీ, పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
హాస్టళ్లలో పనితీరును మరింత మెరుగుపర్చడానికి అధికారులు చొరవతీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అధికారుల చొరవ తీసుకుంటే హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్న ఆమె.. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో వేయికి పైగా గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్డులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదనీ, మరిన్ని గురుకులాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అలాగే, కేసముద్రంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.
దేశంలోనే తెలంగాణ అతి పిన్న వయస్సు కలిగిన రాష్ట్రమనీ, అయితే భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) దార్శనికత, అంకితభావం వల్లనే తెలంగాణలో అపూర్వమైన అభివృద్ధి జరుగుతోందని ఆమె తెలిపారు. మహబూబాబాద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేసిందనీ, దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని పేర్కొన్న మంత్రి సత్యవతి రాథోడ్.. వీటిలో 205 తాండాలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయని తెలిపారు. అలాగే, ఒక్కో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మంత్రి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్, జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పీ అధ్యక్షురాలు బిందు, రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్, డీఎస్పీ సదయ్య, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ చంద్రమోహన్, సర్పంచ్ రోజా రమణి, ఆర్‌సీఓ రాంరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
