ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలిస్తోంది .. ఆ అనుమతులు నిలిపివేయండి: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని తెలంగాణ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.
కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ. శ్రీశైలం ప్రాజెక్ట్ డేటాతో పాటు పలు వివరాలను లేఖలో అడిగారు. అయితే ఆ వివరాలు అడగటాన్ని కేఆర్ఎంబీ తప్పుగా అర్ధం చేసుకుంటోంది. శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్ వెలుపలికి అనధికార మళ్లింపులు జరుగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ సమయంలో 1977 అంతర్రాష్ట్ర ఒప్పందంలోని క్లాజ్ 5కి కేంద్రం హామీ ఇచ్చింది. గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేపడుతున్నారని తెలంగాణ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేశామని.. అక్రమ ప్రాజెక్ట్‌ల అనుమతులు నిలిపివేయాలని ఈఎన్సీ లేఖలో కోరారు. తదుపరి ఆర్ఎంసీ సమావేశం నాటికి తాము కోరిన వివరాలను అందించాల్సిందిగా కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
ఇకపోతే.. కృష్ణా నదీపై అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌లను తక్షణమే నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) (krmb) తెలుగు రాష్ట్ర (krishna river management board) ప్రభుత్వాలకు గత నెల 15న లేఖ రాసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై వున్న ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (jal shakti ministry) గతేడాది ఇచ్చిన గెజిట్ నోటిఫిషన్ గడువు ముగియడంతో కేఆర్ఎంబీ ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతుల్లేని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏపీ, తెలంగాణ పరస్పరం ఫిర్యాదులు చేశాయని బోర్డు తన లేఖలో తెలిపింది. ప్రాజెక్ట్ అనుమతులకు కేంద్రం ఇచ్చిన గడువు జూలై 13తో ముగిసిందని ప్రస్తావించింది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు వున్నాయని బోర్డ్ తెలిపింది.
ALso Read:అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు తక్షణం ఆపేయండి... ఏపీ, తెలంగాణలకు కేఆర్ఎంబీ లేఖ
కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూలై 14, 2021 నుంచి కృష్ణా, గోదావరి నదులపై వున్న ప్రాజెక్ట్‌లను తమకు అప్పగించాలని కేంద్ర జలశక్తి బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి ఇవ్వబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. తెలంగాణ ఇస్తేనే తామూ ఇస్తామని ఏపీ ప్రభుత్వం సైతం మెలిక పెట్టింది. మరోవైపు ప్రాజెక్ట్‌ల అప్పగింతపై ప్రత్యేక బోర్డు విధించిన గడువు జూలై 14తో ముగిసింది.