తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. శాసనసభ సమావేశాల సందర్భంగా మాటల యుద్దం మొదలైంది.

తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. శాసనసభ సమావేశాల సందర్భంగా ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం మొదలైంది. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండటం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈసారి గత సెషన్ కొససాగింపు అని చెప్పిన ప్రభుత్వం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పింది. అయితే దీనిపై తాజాగా స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 

‘బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కానీ సాంకేతిక అంశం వల్ల ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు నా సిఫారసు కోరింది. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేశారు. ఆర్థిక బిల్లు సిఫార్సు చేసేందుకు సమయం తీసుకునే స్వేచ్చ ఉన్నప్పటికీ.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు చేశాను. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది’ అని రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. 

అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత.. అప్పుడున్న గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో సఖ్యతగానే ఉన్నారు. కానీ నరసింహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను విభేదించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్, నరసింహన్‌లు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగారు. నరసింహన్ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ బాధ్యతలు చేపట్టారు. ఆమె రాష్ట్రానికి వచ్చిన కొద్ది రోజులు.. రాజ్‌భవర్, ప్రగతి భవన్‌ మధ్య సఖ్యత ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. 

అయితే గత కొద్దికాలంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య దూరం పెంచాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానించేలా వ్యవహరిస్తుందని బీజేపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం కేంద్రం గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం అనధికారకంగా తన వాదనలను లీక్ చేసింది. గవర్నర్‌ తమిళిసై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమిళ‌నాడు బీజేపీ శాఖ అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన త‌మిళ‌సై.. గ‌వ‌ర్న‌ర్‌గా తెలంగాణకు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న పాత వాస‌న‌లు పోగొట్టుకోలేద‌ని.. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయని చెబుతోంది.

-కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌లేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలా కాలం త‌న ద‌గ్గ‌రే పెట్టుకున్నారు. ప్ర‌భుత్వ వ‌ర్గాలు కౌశిక్ రెడ్డి అభ్య‌ర్ధిత్వాన్ని ఆమోదించాల‌ని కోరిన‌పుడు.. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయ‌ని చెప్పారు. అలా భావిస్తే సిఫార్సును తిరస్కరించాలని కోరినా గవర్నర్‌ స్పందించలేదు. ప్రభుత్వ మాటకు విలువ ఇవ్వలేదు. కౌశిక్‌రెడ్డిపై కేసులున్నా.. శిక్షపడితే మాత్రమే అనర్హుడు అనొచ్చు. కానీ గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సిఫార్సును తొక్కిపెట్టారన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. 

-ఇక శాస‌న‌మండ‌లికి ప్రొటెం ఛైర్మ‌న్ గా ఎంఐఎం స‌భ్యులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమీనుల్ జాఫ్రీని రిక‌మండ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఫైల్‌ను గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే.. గ‌వ‌ర్న‌ర్ దీనిపై నిర్ణ‌యం తీసుకోకుండా నాన్చివేత దోర‌ణితో వ్య‌వ‌హ‌రించారు. ప్రొటెం ఛైర్మ‌న్ ఎందుకు డైరెక్ట్‌గా చైర్మ‌న్ ఎన్నిక పెట్టండి అని గ‌వ‌ర్న‌ర్ ఉచిత స‌ల‌హాను ప్ర‌భుత్వానికి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో 13 నెలలపాటు ప్రొటెం చైర్మనే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పినా గవర్నర్‌ వినలేదు. రాష్ట్ర ప్రభుత్వం చివరికి దేశంలో ఏయే రాష్ట్రాల్లో ప్రొటెం చైర్మన్లుగా ఎన్నినెలలు, ఎంత కాలం ఉన్నారన్న సమాచారాన్ని సేకరించి గవర్నర్‌కు అందజేసింది. రాజ్యాంగం ఏం చెప్తున్నదో వివరించింది. ఆ తర్వాతే జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

-గ‌వ‌ర్న‌ర్ శాస‌న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించినా.. 26 జ‌న‌వ‌రి నాడు జెండా ఎగుర‌వేసి మాట్లాడినా ప్ర‌భుత్వం (మంత్రి మండ‌లి) ఆమోదించిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే చ‌దువాలి. సొంతంగా ప్ర‌సంగాలు చేయ‌డానికి వీల్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు. ఈసారి జ‌న‌వ‌రి 26న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం పంపించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్నే చ‌దివింది. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 26వ తేదీ ప్ర‌సంగానికి సంబంధించి ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఎలాగూ బ‌హిరంగ స‌భ లేదు కాబ‌ట్టి ఏలాంటి ప్ర‌సంగాలు వ‌ద్ద‌నుకున్నారు. కానీ, గ‌వ‌ర్న‌ర్ అనూహ్యంగా 26 జ‌న‌వ‌రి నాడు ప్ర‌సంగించారు. ఇది ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే చ‌ర్య‌గానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.

- 2021-2022 గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో రాష్ట్ర మంత్రిమండ‌లి ఆమోదించ‌ని కొన్ని పేరాల‌ను సొంతంగా చ‌దివారు. అప్పుడు ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించ‌లేదు.

-దేశంలో మ‌న రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్లకు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి త‌లెత్తిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. గ‌తంలో రాంలాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌పుడు నాటి ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఆయ‌న ఆ త‌ర్వాత చాలా అవ‌మాన‌క‌రంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత క్రిష్ణ‌కాంత్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌పుడు కూడా ఇలాగే జ‌రిగింది. నిన్న‌మొన్న మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌న అతివ‌ల్ల శాస‌న‌స‌భ‌లో అవ‌మాన‌క‌రంగా స‌భ జ‌రుగుతుండ‌గానే నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి, రాజ్యాంగ బ‌ద్దంగా న‌డుచుకునే ధోర‌ణి గ‌వ‌ర్న‌ర్ల‌కు ముఖ్యం. ఇలా కాకుండా కేంద్ర ప్ర‌భుత్వాల‌కు తోలుబొమ్మ‌లుగా మారిన ఏ గ‌వ‌ర్న‌ర్ కూడా ఎక్కువ కాలం రాష్ట్రాల్లో ప‌నిచేయ‌లేక‌పోయారు. అయినా.. ఇప్ప‌టికీ తెలంగాణాలో త‌మిళ‌సై ప‌రిస్థితి ఇంకా చేయిదాటిపోలేదు. స‌వ‌రించుకుంటేనే మంచిద‌న్న అభిప్రాయం రాజ్యాంగ‌, రాజ‌కీయ ప్ర‌ముఖులు అబిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ మేరకు గవర్నర్ స్పందనపై ప్రభుత్వ వర్గాల నుంచి లీక్‌లు వెలువడ్డాయి.