సస్పెన్స్‌కు తెర : రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు.. అక్కడే పోలీస్ పరేడ్ , క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్
గురువారం రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 6.50 నుంచి పోలీస్ పరేడ్ జరగనుండగా, 7 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి సస్పెన్స్‌కు తెరపడింది. గురువారం ఉదయం 7 గంటలకు రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరగనున్నాయి. గణతంత్ర వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో.. సర్కార్ ఏం చేస్తుందా అని ఉత్కంఠ నెలకొంది. అయితే ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా ఉదయం 6.50 నుంచి పోలీస్ పరేడ్ జరగనుండగా, 7 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
కాగా... తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించాలని హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు విచారణ నిర్వహించింది. ఐదు లక్షలతో సభ నిర్వహించడానికి కరోనా నిబంధనలు ఏమయ్యాయని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ ఏడాది రాజ్ భవన్ లో నే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఏజీ చెప్పారు.
Also REad: రిపబ్లిక్ డే వేడుకల వివాదం.. కేసీఆర్ చెబితేనే రాజ్‌భవన్‌కి : మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్కులర్ ను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించిందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో రిపబ్లిక్ డే ఉత్సవాలను పరిమితమైన సంఖ్యలో ఆహ్వానితుల మధ్య నిర్వహించిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. అయితే కరోనా నిబంధనలు ప్రస్తుతం లేవని ఆయన వాదించారు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించడాన్ని రాజకీయం చేయడం తగదని అడ్వకేట్ జనరల్ కోరారు. పరేడ్ ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రిపబ్లిక్ డే నిర్వహణ విషయమై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ ను పాటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19 తేదీల్లో సర్క్యులర్ జారీ చేసింది. అయితే రిపబ్లిక్ డే ఉత్సవాలను రాజ్ భవన్ లో నిర్వహించాలని ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది కూడా గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించారు.