ధరణి వెబ్‌సైట్‌లో (dharani portal) భారీ మార్పులకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం (telangana govt) . నిషేధిత భూముల తొలగింపు.. కొత్త మాడ్యూల్స్‌తో సమస్యను పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తోంది. వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే రైతు బంధు అమలు నిలిపివేయనుంది
ధరణి వెబ్‌సైట్‌లో (dharani portal) భారీ మార్పులకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం (telangana govt) . నిషేధిత భూముల తొలగింపు.. కొత్త మాడ్యూల్స్‌తో సమస్యను పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తోంది. వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే రైతు బంధు అమలు నిలిపివేయనుంది. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్ధితి నెలకొంది. రైతుల విన్నపాలు సుమోటాగా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది ప్రభుత్వం. వారం రోజుల్లో ధరణి నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించనున్నారు.
Also Read:ధరణి పోర్టల్‌లో సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలి: కేసీఆర్
ధరణిలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నా డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ధరణి పోర్టల్‌ను వినియోగంలోకి తెచ్చి ఏడాది కావొస్తోంది. అయినా నేటికీ సమస్యలు తీరడం లేదు. రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దయిన సందర్భాల్లో చలానాల రూపంలో చెల్లించిన మొత్తం తిరిగి రావడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. కోట్లాది రూపాయలు ప్రభుత్వం వద్ద వుండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. ధరణిలో రిజిస్ట్రేషన్ స్లాట్‌ను రద్దు చేసుకుంటే ముందుగానే చెల్లించిన సొమ్ము కొన్ని సందర్భాల్లో తిరిగి రావడం లేదు. ఇంకొన్ని సందర్భాల్లో ఒక డాక్యుమెంట్ కోసం చలానాలు కట్టాల్సి వస్తోంది.
ఇలా న్యాయంగా తిరిగి రావాల్సిన డబ్బు ఖాతాల్లో జమ కావడం లేదు. అలాగే మ్యూటేషన్ , సక్షేషన్ అలాగే దరఖాస్తులను కలెక్టర్లు నిరాకరిస్తే ఆ సొమ్ము పొందేందుకు ధరణిలో కనీసం ఆప్షన్ కూడా లేదు. దీంతో ధరణిలో నెలకొన్న సమస్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మండలంలో రోజుకు పది నుంచి 20 దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తూ వుంటారు. అలాగే ప్రతి జిల్లాలో అనివార్య కారణాల వల్ల పది నుంచి 15 రిజిస్ట్రేషన్లు రద్దు అవుతూ వుంటాయి. అలాగే ఒక్కో జిల్లాలో 50 నుంచి 70 వరకు మ్యూటేషన్, సక్షేషన్ దరఖాస్తుల్ని తిరస్కరిస్తూ వుంటారు. వీటిలో చాలా మంది డబ్బు తిరిగి రావడం లేదు. అంటే ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య భారీగా వుందని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులకు సిద్ధమవుతోంది.
