Dharani Portal : ధరణి ఉంటదా.. ఉండదా ..ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ రెడీ, ఐదుగురు సభ్యులతో కమిటీ
ధరణి పోర్టల్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం , పునర్నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.
ధరణి పోర్టల్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం , పునర్నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సీసీఎల్ఏ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ వున్నారు. పరిస్ధితులు, అవసరాన్ని బట్టి కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులను సభ్యులుగా చేర్చుకోవచ్చని ప్రభుత్వం జీవోలో తెలిపింది. సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. తెలంగాణ ఎన్నికల ప్రచారం ‘‘ధరణి’’ పోర్టల్ చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. దీనికి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో కౌంటర్ ఇచ్చేవారు. ధరణి వుండటం వల్లే రైతులకు రైతు బీమా, రైతు బంధు సకాలంలో అందుతున్నాయని.. ధరణి లేకుంటే ఇవి సాధ్యం కాదని కేసీఆర్ చెప్పేవారు. ధరణిపై పూర్తిగా రైతులదే అధికారమని.. ముఖ్యమంత్రి కూడా అందులో మార్పులు చేయలేరని గులాబీ దళపతి వ్యాఖ్యానించారు. రైతులు బాగుండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ అభ్యర్ధించారు.
అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే జై కొట్టారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హామీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ధరణిలో లోటు పాట్లు సవరించడంతో పాటు అవసరమైతే కొత్త పోర్టల్ తీసుకొచ్చే అవకాశం వుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.