పే స్కేల్ పెంపు, ప్రమోషన్ కోసం గత కొన్ని రోజులుగా వీఆర్ఏలు చేస్తోన్న ఆందోళనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.  సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. వీఆర్ఏలు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరింది. 

పే స్కేల్ పెంపు, ప్రమోషన్ కోసం గత కొన్ని రోజులుగా వీఆర్ఏలు ఆందోళనలు (vra protest) చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) స్పందించింది. వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఆందోళనలతో సమయం వృథా చేసుకోవద్దని హితవు పలికింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. వీఆర్ఏలు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరిందని ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

మరోవైపు ఆదివారంతో వీఆర్ఏల ఆందోళన నాల్గవ రోజుకు చేరుకుంది. వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి రెండేళ్లయినా దీనిని అమలు చేయకపోవడం దారుణమని వారు మండిపడుతున్నారు. పే స్కేల్ అమలు చేస్తే సమస్యలన్నీ తీరుతాయని.. 4 రోజులుగా విధులు మాని రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 

ALso Read:పే స్కేల్, ప్రమోషన్ కోసం వీఆర్ఏల ఆందోళన.. కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత, సిరిసిల్లలో ఉద్రిక్తత

కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ఆందోళన నిర్వహించారు. మంత్రి కేటీఆర్ (ktr) కాన్వాయ్‌ను వీఆర్ఏలు అడ్డుకున్నారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అటు వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్, ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను కాల్చిపారేస్తానన్న సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.