తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటన సాగుతుంది. అశ్వాపురం మండలంలోని పాములపల్లి, భట్టిలగుంపు వరద ప్రభావిత ప్రాంతాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరిశీలించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటన సాగుతుంది. అశ్వాపురం మండలంలోని పాములపల్లి, భట్టిలగుంపు వరద ప్రభావిత ప్రాంతాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరిశీలించారు. పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను పరిశీలించడంతో పాటుగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అయితే తమిళిసై పర్యటనలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళిసై వెంట ఏఎస్పీ, ఆర్డీవో ఉన్నారు. ఇక, ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రోటోకాల్ వివాదం నో కామెంట్ అని అన్నారు. వరద బాధితులతో మాట్లాడుతున్నట్టుగా తెలిపారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పారు.
ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శనివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు విందుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ఆమె రాష్ట్రపతితో మాట్లాడి రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వరదల పరిస్థితిని వివరించి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాల్సిన ఆవశ్యకత గురించి ఆయనకు తెలియజేసినట్టుగా గవర్నర్ కార్యాలయం తెలిపింది. భద్రాచలం, చుట్టుపక్కల ప్రాంతాలలో వరద బాధిత ప్రజల దుస్థితిని చూసి గవర్నర్ చలించిపోయారని.. న్యూఢిల్లీ పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారని పేర్కొంది.
ఇక, షెల్టర్ క్యాంపులు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్య, ఇతర సహాయ చర్యలను అందించాలని ఆమె ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ESIC మెడికల్ కాలేజీ బృందాలను కూడా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నిమిత్తం శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఆదివారం తెల్లవారుజామున మణుగూరు చేరుకున్నారు. మణుగూరులో అధికారులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ తమిళిసై అశ్వాపురం మండలం చేరుకున్నారు.
మరోవైపు కేసీఆర్ పర్యటన..
మరోవైపు సీఎం కేసీఆర్ కూడా భద్రాద్రి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే తొలుత హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేయాలని కేసీఆర్ భావించిన.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయన రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు బయలుదేరారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన కేసీఆర్ ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం చేరుకుంటారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ పర్యటన సాగిస్తున్నారు. భద్రాచలంలో వరద పరిస్థితిని సమీక్షించనున్నారు.
భద్రాచలం వద్ద గోదావరిలో తగ్గిన వరద ఉధృతి..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. శుక్రవారం రాత్రి సమయంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గరిష్టం 71.30 అడుగులకు చేరింది. ఆ తర్వాత నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు భద్రాచంలో నీటి మట్టం 63.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొసాగుతుంది. అయితే వరద తగ్గినప్పటికీ.. భద్రాచలంలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఇక, భద్రాద్రి జిల్లాలో గత రాత్రి మళ్లీ వర్షం కురుస్తోంది.
