తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈటల నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర కేబినెట్‌లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ వుండనున్నారు. 

కాగా, మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ఈటల భూకబ్జాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో వారు ప్రభుత్వం 1994లో తమకు సర్వ్ నెంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికీ 1 ఎకరం 20 కుంటల చొప్పున, అలాగే సర్వే నెంబర్ 64/6 లో మూడు ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు తెలిపారు.

కొన్ని రోజులుగా ఈ భూముల కోసం ఈటల రాజేందర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ అసైన్డ్ భూములను త్వరలో ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుంటుందని రాజేందర్ బెదిరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

Also Read:ఈటలపై ఆరోపణలు, మరోసారి నిజమవుతున్న ఆరోగ్యశాఖ సెంటిమెంటు

ఇప్పటికే అక్కడ దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటల రాజేందర్ ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని.. అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నరంటూ  తీవ్ర ఆరోపణలు చేశారు.

దీనిని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.. శనివారం విచారణ ప్రారంభించారు.