కాళోజీ నారాయణ రావు వర్సిటీలో పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. సీట్ల బ్లాక్ దందాపై నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు.
మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై (pg medical seats scam) తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందర్ రాజన్ ఆరా (tamilisai soundararajan) తీశారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని ఆందోళనగా వుందన్నారు. తాను స్వయంగా డాక్టర్‌నని.. సీట్ల బ్లాక్ దందాపై నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించామని గవర్నర్ తెలిపారు. విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
కాగా.. వైద్య విద్యలో స్పెషలైజేషన్ చేసే పీజీ సీట్లకు ‘బ్లాక్’ దందా నడుస్తున్న వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గాల బాటపట్టాయి. ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించడం.. వారికి మేనేజ్‌మెంట్ కోటా సీటు అలాట్ అయ్యాక దానిని వదులుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పించడం జరుగుతోంది. తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును భారీ ధరకు అమ్ముకుంటున్నారు కేటుగాళ్లు. దీనివల్ల మంచి ర్యాంకు వచ్చినా స్థానికంగా సీటు దొరక్క రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. ఈ వ్యవహారంపై విద్యార్థుల ఒత్తిడితో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం (kaloji narayana rao university) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రైవేటు కాలేజీలు కొందరు విద్యార్థుల తోడ్పాటుతో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్ చేస్తున్నట్టుగా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల కౌన్సెలింగ్‌లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. ఈ 40 మందీ మంచి ర్యాంకులు సాధించినవారేనని గుర్తించింది. వారికి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా.. మన రాష్ట్రంలో, అదీ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వర్సిటీ దీనిపై వివరణ కోరుతూ వారందరికీ లేఖలు రాసింది.
అయితే తాము మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తు చేయలేదని వారు చెప్పడంతో యూనివర్శిటీ అధికారులకు అనుమానం వచ్చింది. మెరిట్ స్టూడెంట్స్ పేరుతో వేరే వ్యక్తులు ఎవరైనా ఈ పని చేశారా అనే విషయమై కాళోజీ యూనివర్శిటీ అధికారులు అనుమానంతో ఉన్నారు. ఈ విషయమై వాస్తవాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజ్ మెంట్ కోటా లో ఎంక్యూ1,2, 3 కింద సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మెరిట్ విద్యార్ధులతో మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం ధరఖాస్తు చేయించిన విషయాన్ని కాళోజీ యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశ్యంతో ఇలా చేశారా అనే అనుమానాన్ని యూనివర్శిటీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ యూనివర్శిటీ పరిధిలో 2295 మెడికల్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్ మెంటో కోటా కింద సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్ స్టూడెంట్ తొలుత మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తులు చేయించి ఆ తర్వాత చేరకుండా వెళ్లిపోతున్నారు. దీంతో ఈ సీటు బ్లాక్ అవుతుంది. ఇలా బ్లాక్ అయిన సీటును చివర్లో మేనేజ్ మెంట్ కోటి నుండి 2 కోట్లకు విక్రయించుకొనే వీలుంది. ఈ కారణంగానే మెరిట్ విద్యార్ధులతో మేనేజ్ మెంట్ కోటాలో ధరఖాస్తు చేయించారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే మెడికల్ సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
దేశ వ్యాప్తంగా ఆడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఒకే రకమైన సాఫ్ట్‌వేర్ ను ఉపయోగిస్తుండడంతో ఈ విషయం వెలుగు చూసింది. కాళోజీ యూనివర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేయనున్నారు.
