Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు నాకు మధ్య గ్యాప్ లేదు, విమర్శలకు భయపడను: తమిళిసై


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  నిబంధనలతో తనను అడ్డుకోలేరని ఆమె తేల్చి చెప్పారు.

Telangana Governor Tamilisai Soundararajan sensational Comments lns
Author
First Published Sep 8, 2023, 1:35 PM IST

హైదరాబాద్: కోర్టు కేసులు, విమర్శలకు  తాను భయపడనని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు.గవర్నర్ గా నాలుగేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా  తమిళిసై సౌందరరాజన్  శుక్రవారంనాడు రాజ్ భవన్ లో పుస్తకం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. సీఎం కేసీఆర్ కు తనకు మధ్య ఎలాంటి దూరం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.దూరం గురించి తాను పట్టించుకోనన్నారు.బిల్లుల విషయంలో అభిప్రాయబేధాలు మాత్రమేనన్నారు. కానీ ఈ విషయంలో ఫైటింగ్ కాదని గవర్నర్ తెలిపారు.తాను తన మార్గంలో ప్రయాణీస్తానన్నారు.

గవర్నర్ గా తనకు కొన్ని పరిమితులున్నాయన్నారు.నిబంధనలతో తనను అడ్డుకోలేరని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.  సవాళ్లు, పంతాలకు కూడ తాను భయపడబోనన్నారు.ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని ఆమె తేల్చి చెప్పారు.తాను ఎక్కడ ఉన్న తెలంగాణ ప్రజలతో ఉన్న బంధం మరిచిపోలేనన్నారు. తనది మోసం  చేసే మనస్తత్వం కాదన్నారు.తెలంగాణలో తాను నాలుగేళ్లు పూర్తి చేసుకున్నానని ఆమె గుర్తు చేశారు.

రాజ్యాంగ  పరిరక్షరాలిగా  తన బాధ్యతలను  తాను నిర్వహిస్తానని  గవర్నర్ స్పష్టం చేశారు.ప్రజల విజయమే తన విజయంగా ఆమె పేర్కొన్నారు.సవాళ్లను సమర్థవంతంగా  ఎదుర్కొన్నట్టుగా తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేసుకున్నారు.తనపై  తెలంగాణ ప్రజలు చూపిన  అభిమానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.తెలంగాణ ప్రజలకు  15 శాతం మాత్రమే సేవ చేశానన్నారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు.తనకు కన్నింగ్ మెంటాలిటీ కాదని  గవర్నర్ తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టు  24న  తెలంగాణ మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ... గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో మాట్లాడారు. ఆగస్టు  25న తెలంగాణ సచివాలయంలో  ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.  సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు  తెలంగాణ సచివాలయంలో  ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు.  ఈ పరిణామంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య  దూరం తగ్గిందని అంతా భావించారు. కానీ  ఇవాళ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.  రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య  దూరం తగ్గిందా... దూరం కొనసాగుతుందా  అనే  చర్చ మరో సారి  తెరమీదికి వచ్చింది.

also read:తెలంగాణ సచివాలయం: ప్రార్థన మందిరాలను ప్రారంభించిన తమిళిసై, కేసీఆర్

 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను ఆమోదించడం లేదని  ఈ ఏడాది జనవరి  30న తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించలేదని సుప్రీంకోర్టులో కూడ కేసీఆర్ సర్కార్  పిటిషన్లు దాఖలు చేసింది.  13 నెలల తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికే హాజరయ్యారు.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు కూడ  కేసీఆర్ హాజరు కాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios