తమిళిసై సంచలన నిర్ణయం: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు పేర్లను గవర్నర్ తిరస్కరించారు
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫారసును తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.సామాజిక సేవ కోటా కింద దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయలేదని గవర్నర్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నట్టుగా తమిళిసై సౌందర రాజన్ వివరించారు.
దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని గవర్నర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికి సామాజిక సేవా కార్యక్రమాల్లో వీరిద్దరి పాత్ర గురించి ప్రస్తావించలేదని గవర్నర్ గుర్తు చేశారు. గతంలో కూడ పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును కూడ అప్పట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.
గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలకు ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తూ ఈ ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. ఈ సిఫారసులపై అధ్యయనం చేసి తిరస్కరించారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.
రాష్ట్రంలో ఎందరో అర్హులున్నారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. అర్హులైన వారి పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తే ఆమోదం తెలపనున్నట్టుగా తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఈ విషయమై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖను పంపారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఏ ఏ కారణాలతో రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో వేర్వేరు లేఖల్లో గవర్నర్ వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖలు పంపారు.ఇద్దరి అభ్యర్ధిత్వాలను గవర్నర్ రద్దు తిరస్కరించడంతో కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.