రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఫోన్ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఆమె ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఎస్‌ఈసీని గవర్నర్ ఆదేశించారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని కమీషనర్‌.. గవర్నర్‌కు వివరించారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని గవర్నర్‌ తమిళిసైని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం నాడు ఫోన్ చేశారు. గవర్నర్ కి ఉత్తమ్  లేఖ రాయడంతో  తమిళిసై ఫోన్ చేశారు.రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో  రాష్ట్రంలోని రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ గవర్నర్ కు లేఖ రాశాడు. 

Also Read:ఎస్ఈసీతో మాట్లాడుతా: ఉత్తమ్‌ లేఖకి ఫోన్ లో గవర్నర్ తమిళిసై రిప్లై

ఈ లేఖలో పొందుపర్చిన విషయాలపై ఇతర అంశాలపై చర్చించేందుకు గను తమిళిసై ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం నాడు ఫోన్ లో మాట్లాడారు. లేఖలో పొందుపర్చిన అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ఆమె అడిగి తెలుసుకొన్నారు. ఎన్నికల విషయమై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తానని  గవర్నర్  తమిళిసై ఉత్తమ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ పిటిషన్ దాఖలు చేశారు.  రెండు దఫాలు ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.  రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు మున్పిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.