భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. గోదావరి వరదలు క్లౌడ్ బరస్ట్ అని.. దీని వెనక విదేశీ కుట్రలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు.  కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

గోదావరి వరదల వెనుక విదేశాల కుట్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్.. గోదావరి వరదలు క్లౌడ్ బరస్ట్ అని.. దీని వెనక విదేశీ కుట్రలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేసీఆర్ మాటలు పెద్ద జోక్ ‌ అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. అయితే ఎలాంటి వాస్తవం లేదని.. కేసీఆర్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నాయి.

అయితే తాజాగా క్లౌడ్ బరస్ట్‌‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని అన్నారు. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని చెప్పారు. కాకపోతే కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు. అయితే గవర్నర్ తమిళిసై చేసిన ఈ కామెంట్స్‌.. కేసీఆర్‌కు కౌంటర్‌గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. 

ఇక, గత కొంతకాలంగా తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం.. కేసీఆర్ దాదాపు 8 నెలల తర్వాత రాజ్‌భవన్‌‌కు వెళ్లారు. అయితే దీంతో పరిస్థితులు కాస్తా చక్కబడినట్టుగా అంతా భావించారు. అయితే ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకే రోజు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పర్యటనలు సాగించడం.. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌ భవన్ మధ్య విభేదాలు తొలగిపోలేదనే చర్చను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా క్లౌడ్ బరస్ట్‌పై తమిళిసై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.