సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం: ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తమిళిసై


సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  కోరారు. హైద్రాబాద్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ ను ప్రారంభించారు.

Telangana Governor Tamilisai Soundararajan Calls Telangana liberation day On September 17

హైదరాబాద్:నిజాం నవాబు నుండి హైద్రాబాద్ కు విముక్తి లభించిన రోజు కావడంతో సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  కోరారు.బుధవారం నాడు హైద్రాబాద్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.తెలంగాణ ప్రజలు చరిత్రను తెలుసుకోవాలని గవర్నర్ సూచించారు. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని గవర్నర్ చెప్పారు.  ఆనాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలను మర్చిపోలేమని ఆమె చెప్పారు. 

 నిజాం పాలనలో పరకాలలో 35 మందిని కాల్చి చంపిన ఘటనను గవర్నర్ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఆనాడు చోటు చేసుకున్నాయన్నారు. ఈ తరహ ఘటనలను ఎలా మర్చిపోతామని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనల్లో చనిపోయినవారు మన సోదరులు, సోదరీమణలని ఆమె చెప్పారు. అమరుల రక్తం తెలంగాణపై చిందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇంత మంది త్యాగాలు చేయడంతో సెప్టెంబర్ 17వ తేదీన హైద్రాబాద్ విమోచనం పొందిందన్నారు. అందుకే ఆ రోజును విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ఆమె కోరారు. బైరాన్ పల్లిలో 90 మందిని చంపిన ఉదంతాన్ని గవర్నర్  ప్రస్తావించారు. చరిత్రను దాచిపెట్టలేమన్నారు.ఈ తరం యువత ఆనాడు చోటు చేసుకున్న ఘటనల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకారు మూకలు ఈ దాడులు చేశారని ఆమె గుర్తు చేశారు. 

హైద్రాబాద్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఈ నెల 17న నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా  ఆహ్వానం పంపింది కేంద్రం,. అయితే అదే సమయంలో జాతీయ సమైక్యత ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. హైద్రాబాద్ వేదికగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు. గతంలో హైద్రాబాద్ రాష్ట్రంలో కర్ణాటక, మహరాష్ట్రలోని పలు ప్రాంతాలు ఉండేవి. నిజాం పాలన ఉండి ఈ ప్రాంతాలు కూడ ఆనాడు విముక్తి పొందినందున ఈ రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తుతం విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రశ్నిస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 8 ఏళ్లుగా జాతీయ సమైక్యత దినోత్సవాలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios