ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు  తెలంగాణ  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈ మేరకు శనివారం ఆమె ప్రగతి భవన్‌కు పుష్పగుచ్చం పంపారు. అనారోగ్య సమస్యలతో సీఎం ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని తమిళిసై అన్నారు. 

గత కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యమంత్రి vs గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి వుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ కలగజేసుకుంటున్నారని కేసీఆర్ (kcr) అసంతృప్తి వున్నారు. ఇదే సమయంలో రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ హాజరుకాకపోవడం, తర్వాత మేడారం పర్యటన సందర్భంగా గవర్నర్‌ను మంత్రులు పట్టించుకోకపోవడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం పంపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. 

వివరాల్లోకి వెళితే.. అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షిస్తూ లేఖ పంపారు. అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని గవర్నర్ చెప్పారు. 

మరోవైపు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో జరిగిన 2021-22 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల వైట్ కోట్ సెరిమొనీ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్‌కు గురికావద్దని విద్యార్థులకు సూచించారు. వైద్య సేవలు అందించడం కష్టమైనా జాగ్రత్తగా పని చేయాలని కోరారు. వైద్య విద్యార్థులు పరిశోధన, విద్య, ఆటలతో పాటు అన్ని రంగాల్లో పాల్గొనాలని తమిళిసై సూచించారు.

కాగా.. నిన్న ఉదయం సీఎం కేసీఆర్ కు స్వల్పంగా అస్వస్థత ఉందని సమాచారం రావడంతో డాక్టర్ MV Rao తో కలిసి తాను వెళ్లి పరీక్షలు నిర్వహించినట్టుగా యశోదా ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు. అయితే ఎడమ చేయి , ఎడమ కాలు నొప్పి ఉందని చెప్పడంతో యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించాలని భావించి ఆసుపత్రికి సీఎం ను తీసుకొచ్చామని డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.ECG, 2డీ ఈకో, Angiogram పరీక్షల్లో నార్మల్ గా ఉందని తేలిందని ఆయన తెలిపారు. heart కు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. దీంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.. యాంజియోగ్రామ్ పరీక్షల్లో కూడా ఎలాంటి బ్లాక్స్ లేవని తేలిందని డాక్టర్ ప్రమోద్ తెలిపారు. 

శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేశారని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. తనకు నీరసంగా ఉందని సీఎం చెప్పారన్నారు. ఎడమ చేయి లాగుతుందని చెప్పారు. డాక్టర్ ప్రమోద్ కుమార్ తో కలిసి వెళ్లి పరీక్షలు చేశామన్నారు. MRI పరీక్షలు కూడా నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు వివరించారు మెడ నొప్పి కారణంగా ఎడమ చేయి నొప్పి ఉందని తాము తేల్చామని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తే అన్ని పరీక్షల పలితాలు నార్మల్ గానే ఉన్నాయని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో 90 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.ఇంకా ఒకటి రెండు పరీక్షల పలితాలు రావాల్సి ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవాలని తాము సూచించామన్నారు.