Asianet News TeluguAsianet News Telugu

రోడ్లపై గుంతలు పూడుస్తున్న గంగాధర్ తిలక్: తమిళిసై సత్కారం

దశాబ్ద కాలంగా హైదరాబాదు రోడ్లపై గుంతలను పూడుస్తూ సామాజిక సేవ చేస్తున్న గంగాధర్ తిలక్ దంపతులను తెలంగాణ గవర్నర్ తమిళిసై సత్కరించారు. గంగాధర తిలక్ సేవలను ఆమె కొనియాడారు.

Telangana governor Tamilisai hails Gangadhar Tilak service
Author
Hyderabad, First Published Jul 15, 2021, 8:18 AM IST

హైదరాబాద్: రోడ్లమీద ఏర్పడే ప్రమాదకరమైన గుంతలను పూడ్చే పనిని స్వచ్ఛందంగా చేపట్టిన గంగాధర్ తిలక్ ను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారంనాడు రాజ్ భవన్ లో సత్కరించారు. ప్రమాదాలను నివారించడానికి, జీవితాలను కాపాడడానికి రోడ్లపై గుంతలు పూడ్చడమే లక్ష్యంగా చేసుకొని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్నిగత దశాబ్ద కాలం పైగా గంగాధర్ చేపట్టడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. 

గంగాధర్ ను "రోడ్ డాక్టర్" గా గవర్నర్ అభివర్ణించారు.గంగాధర్, ఆయన భార్య వెంకటేశ్వరి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని గవర్నర్ అన్నారు. గంగాధర్ ను, ఆయన భార్యను మన కాలం  "అన్ సంగ్  హీరోస్" గా గవర్నర్ కొనియాడారు. రోడ్ల పై జరుగుతున్న కొన్ని ప్రమాదాలను చూసి చలించిన గంగాధర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని  చేపట్టి గత దశాబ్ద కాలంగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.

ఇంత వయసులో, ఇంత ఓపికగా, సొంత ఖర్చుతో రోడ్లపై గుంతలు పూడ్చడం ఒక ఉద్యమంగా చేపట్టిన గంగాధర్ దంపతులు అందరికీ స్ఫూర్తిదాయకం అని డాక్టర్ తమిళి సై అన్నారు.గవర్నర్ డాక్టర్ తమిళిసై ఈ దంపతులకు శాలువా, జ్ఞాపికలు బహూకరించి రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రత్యేకంగా  సత్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios