Asianet News TeluguAsianet News Telugu

ఈ పరిశోధనల వల్లే...కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో హైదరాబాద్ ముందంజ: గవర్నర్ తమిళిసై

బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని... ఈ పరిశోధనలు కోవిడ్-19 పై మానవాళి పోరాటంలో కీలకమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. 
 

Telangana governor tamilasai soudarrajan comments about corona vaccine development
Author
Hyderabad, First Published Jul 16, 2020, 8:30 PM IST

హైదరాబాద్: బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని... ఈ పరిశోధనలు కోవిడ్-19 పై మానవాళి పోరాటంలో కీలకమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్-19 నివారణకు వ్యాక్సీన్ అభివృద్ధికి, చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంతావశ్యం అని గవర్నర్ తెలిపారు. 

జెఎన్‌టియూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ''ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020'' అన్న అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్ భవన్ నుండే ఆన్ లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. 

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... కోవిడ్ సంక్షోభం ''జీవితాలా - జీవనోపాదులా'' అన్న సంక్లిష్ట సమస్యను ప్రపంచం ముందుంచింది అని అన్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాలలో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని... సైంటిస్టులు ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్న నేపధ్యంలో భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతున్నదన్నారు. భారతదేశం ప్రస్థుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని... త్వరలోనే గ్లోబల్ మార్కెట్ లో 20 శాతం సాధిస్తుందని తమిళిసై వివరించారు. 

read more  కరోనా నుంచి రక్షిస్తున్న మాస్కులతో ప్రపంచానికి ముంచుకొస్తున్న ముప్పు

హైదరాబాద్ ''బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్'' గా ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని... కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉందని డా. తమిళిసై వెల్లడించారు. 

సైన్స్ లో మహిళా పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో జె.ఎన్.టి.యూ. హైదరాబాద్, ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ ఇన్ సైన్స్ ఫర్ ది డెవలపింగ్ వరల్డ్(OWSD) సంస్థతో భాగస్వామ్యం వహించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. సైన్స్ లో మహిళా పరిశోధకులకు, ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జై జవాన్, జై కిసాన్ నినాదానికి జై విగ్యాన్ అన్న నినాదం కూడా జతచేసి సైనికులు, రైతుల సరసన సైంటిస్టులకు సముచిత గౌరవం కల్పించారని గవర్నర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటి ప్రిన్సిపన్ సెక్రటరి, జె.ఎన్.టి.యూ ఇంఛార్జ్ వైస్-ఛాన్సలర్ జయేష్ రంజన్, యూనివర్సిటి రెక్టార్ ప్రొ. గోవర్థన్, రిజిస్ట్రార్ ప్రొ. మంజూర్ హుస్సేన్, కన్వినర్ డా. ఉమ, అత్యాకప్లే, కౌసర్ జమీల్ ప్రసంగించారు. దేశ, విదేశాల నుండి బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర రంగాల నిపుణులు పాల్గొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios