హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, టీజేఎస్ తోపాటు వామపక్ష పార్టీల నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సెక్షన్ 8 ప్రకారం రాష్ట్రంపై గవర్నర్ కు హక్కులు ఉంటాయని అందువల్ల సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలైన షబ్బీర్ అలీ, ఎంపీ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు గవర్నర్ నరసింహన్ . అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రెండు రాష్ట్రాల సీఎంలను తమరే చూసుకుంటున్నారు కదా తమకు తెలియనిది ఏముందంటూ చెప్పుకొచ్చారు. నిజంగానే రెండు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని సీఎంలనే పట్టించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 

షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్ నరసింహన్. తాను రెండు రాష్ట్రాలను పట్టించుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై చేసుకోండని తన దగ్గర కాదంటూ షబ్బీర్ అలీకి చురుకలంటించారు గవర్నర్ నరసింహన్.