Telangana land value: తెలంగాణ ప్రభుత్వం భూముల విలువలను భారీగా పెంచేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత, ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటోంది.
Telangana land value: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రభుత్వం ఖజనాలో ఆదాయం చేకూర్చేలా భూముల విలువలు భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈ నెల చివరి వారంలో( ఆగస్ట్ 29 న) జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ నిర్ణయంపై క్లారిటీ వస్తే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త రేట్లను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించనున్నట్లు ప్రకటించారు. ఈ సవరణతో బ్లాక్ మనీ చెలామణీకి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సవరణ వెనుక కారణమిదేనా..
తెలంగాణ రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోవడంతో, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూముల లావాదేవీలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి భూముల విలువలను రెండు నుంచి మూడు రెట్లు పెంచాలనే ఆలోచనలో ఉందని సమాచారం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా ప్రకారం.. భూముల విలువల సవరణతో అదనంగా రూ. 2,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
భూముల విలువలను గతంలో కూడా రెండు సార్లు పెంచారు. 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 20 శాతం పెంచగా, 2022లో 33 శాతం పెంచారు. అప్పటి నుంచి మార్పులు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లోనే సవరించాలని అనుకున్నా, అమలు కాలేదు. ఇప్పుడు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సారి 20 నుంచి 30 శాతం విలువ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వ్యవసాయ భూములు సహా అన్ని రకాల భూముల విలువలు పెరిగే అవకాశం ఉంది.
ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల ప్రభావం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా భారీ ఆదాయం వస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచే 60% ఆదాయం వస్తోంది. కొత్త సవరణలతో ఈ ప్రాంతాల్లో ప్లాట్లు, భూముల విలువలు మూడింతలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో కూడా భూముల వ్యాపారం బాగా పెరుగుతున్నందున, అక్కడ కూడా భారీ పెంపు ఉంటుందని సమాచారం.
పట్టణ పాంత్రాల్లో
ప్రస్తుతం పట్టణ పాంత్రాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరాకు రూ. 6 లక్షలు మాత్రమే ఉంది. ఈ సవరణలో దాన్ని రూ. 12 నుంచి రూ. 18 లక్షల వరకు పెరిగే అవకాశముంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరాకు రూ. 20 లక్షలుగా ఉన్నా, మార్కెట్లో ఆ విలువ కోటి రూపాయల నుంచి 20 కోట్ల వరకు పలుకుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో రేట్లు బహిరంగ మార్కెట్‌కు దగ్గరగా ఉండేలా 300% వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహిళలకు ప్రత్యేక రాయితీ
ఈ సవరణలో మహిళలకు 1.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపుని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో మహిళలు మరింతగా రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ముందుకు రావచ్చని అంచనా. మొత్తం మీద ఈసారి భూముల విలువల సవరణ రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంపై విస్తృత ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు.
