Asianet News TeluguAsianet News Telugu

విజృంభిస్తోన్న కరోనా : పాక్షిక లాక్‌డౌన్ దిశగా తెలంగాణ.. త్వరలోనే కేసీఆర్ నిర్ణయం..?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

telangana government may implement lockdown again ksp
Author
Hyderabad, First Published Mar 21, 2021, 8:57 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి.

ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరుగులు పెట్టించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమవుతోంది. పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూ, పాఠశాలల మూసివేత తదితర అంశాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

త్వరలోనే కరోనా స్థితిగతులపై సీఎం కేసీఆర్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలోనే కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. 

ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున వైరస్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శని, ఆది వారాల్లో రాజధాని హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారంలో 2 రోజులు లాక్‌డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే కరోనాకు కేంద్రాలుగా మారుతున్న స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని నిర్ణయం తీసుకోనుంది. సినిమా థియేటర్లు, పార్క్‌లు, జనాల రద్దీ ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సర్కార్ భావిస్తోంది. కరోనా తీవ్రత నేపథ్యంలో మార్చి 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలను ముగించే యోచనలో ప్రభుత్వం వుంది.

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 394 మందికి కరోనా సోకింది. శనివారం 64,898 టెస్టులు చెయ్యగా 394 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,03,118కి చేరింది. కొత్తగా కరోనాతో ముగ్గురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,669కి చేరింది.

Follow Us:
Download App:
  • android
  • ios