Hyderabad: ఆయిల్ పామ్ సాగును మ‌రింత‌ సులభతరం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం మొబైల్ యాప్ ను విడుద‌ల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 15,710 మంది రైతులు 61,277 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయగా, 2023-24 సంవత్సరానికి రాష్ట్రంలో అదనంగా రెండు లక్షల ఎకరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Oil Palm cultivation-Mobile App: తెలంగాణ ఆయిల్‌పామ్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌ పోర్టల్‌ను రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతికుమారితో కలసి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రారంభించారు. ఆయిల్ పామ్ సాగును మ‌రింత‌ సులభతరం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఈ మొబైల్ యాప్ ను విడుద‌ల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 15,710 మంది రైతులు 61,277 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయగా, 2023-24 సంవత్సరానికి రాష్ట్రంలో అదనంగా రెండు లక్షల ఎకరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర చమురు సమాఖ్య చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ కమిషనర్‌ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌ సాగు పథకం అమలులో సౌలభ్యం, పారదర్శకత కోసం ఈ మొబైల్‌ యాప్‌, వెబ్‌ పోర్టల్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో పామాయిల్‌కు 100 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా డిమాండ్‌ ఉండగా, ప్రస్తుతం 2.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉందని వివరించారు. దేశంలో పామాయిల్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా మరో 70 లక్షల ఎకరాల విస్తీర్ణం అవసరమని మంత్రి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.66 లక్షల టన్నుల పామాయిల్‌ అవసరం కాగా ప్రస్తుతం 52,666 టన్నుల పామాయిల్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ పామ్ పథకం అమలులో పాల్గొన్న రైతులు, రాష్ట్ర-జిల్లా స్థాయి ఉద్యానవన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీలు-నర్సరీ ఇన్‌ఛార్జ్‌లు ఈ మొబైల్ యాప్‌లో భాగం అవుతారని తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగు చేయాల్సిన భూమి, పంపిణీ చేసిన మొక్కలు, అంతర పంటలు, పంటలకు అందించే రాయితీల వివరాలను సకాలంలో ఈ యాప్‌లో నమోదు చేస్తామని మంత్రి వివరించారు.

మొదటి విడతగా విడుదల చేసిన రూ.107.43 కోట్లతో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. "విడుదల చేసిన మొత్తంలో రూ. 82 కోట్లు రైతులకు, కంపెనీలకు రాయితీగా అందించబడ్డాయి. ఇక్కడ ఆయిల్ పామ్ సాగు, అంతర పంటలు-సూక్ష్మ నీటిపారుదలలో ఎకరాకు రాయితీగా రూ. 50,918 ఖర్చు అవుతుంది" అని ఆయన వివరించారు. 2023-24 సంవత్సరానికి గాను 15,710 మంది రైతులు 61,277 ఎకరాలను ప్రస్తుత 2022-23లో రాష్ట్రంలో అదనంగా రెండు లక్షల ఎకరాలు సాగు చేశార‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, తెలంగాణ ప్రభుత్వం సోమవారం సమర్పించిన 2023-24 బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు మరికొన్ని కీలక శాఖలకు కేటాయింపులను పెంచింది. వ్యవసాయం, అనుబంధ శాఖల కోసం రూ.26,831 కోట్లను ప్రతిపాదించగా, నీటిపారుదలతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యాంశాలుగా నిలిచాయి. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం గతేడాది కంటే రూ.2,385 కోట్లు పెంచి రూ.6,385 కోట్లు కేటాయించింది. రైతులకు ఏటా ఎకరాకు రూ.10,000 చొప్పున పెట్టుబడి సాయం అందించే ఫ్లాగ్‌షిప్ పథకమైన రైతుబంధు కోసం కేటాయింపులను స్వల్పంగా రూ.15,075 కోట్లకు పెంచారు. రైతులకు బీమా కేటాయింపులను రూ.1,465 కోట్ల నుంచి రూ.1,589 కోట్లకు తీసుకువ‌చ్చారు.